Jump to content

లిస్ట్ ఎ క్రికెట్

వికీపీడియా నుండి
(List A cricket నుండి దారిమార్పు చెందింది)

లిస్ట్ ఎ క్రికెట్ అనేది క్రికెట్‌లో పరిమిత-ఓవర్ల (వన్-డే) రూపంలో జరిగే మ్యాచ్‌ల వర్గీకరణ. ఈ వర్గం లోకి వచ్చే గేమ్‌లు జరిగే వ్యవధి ఎనిమిది గంటల వరకు ఉంటుంది. లిస్ట్ ఎ క్రికెట్‌లో వన్ డే ఇంటర్నేషనల్ (ODI) మ్యాచ్‌లు, వివిధ దేశీయ పోటీలూ ఉంటాయి, దీనిలో ఒక్కో జట్టు ఆడే ఇన్నింగ్స్‌లో ఓవర్ల సంఖ్య నలభై నుండి అరవై వరకు ఉంటుంది. అలాగే అధికారికంగా వన్‌డే హోదాను సాధించని దేశాలతో కూడిన కొన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా ఉంటాయి. ఫస్ట్-క్లాస్, ట్వంటీ 20 క్రికెట్‌తో పాటు, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ గుర్తింపు పొందిన మూడు ప్రధాన క్రికెట్ రూపాలలో లిస్ట్ ఎ ఒకటి. [1] 2021 నవంబరులో ICC, మహిళల క్రికెట్‌కు కూడా లిస్ట్ ఎ స్థితిని ఇచ్చి, గతంలో జరిగిన మ్యాచ్‌లకు కూడా వర్తింపజేసి, దానిని పురుషుల ఆటతో సమం చేసింది. [2] [3]

స్థితి

[మార్చు]

చాలా టెస్ట్ క్రికెట్ దేశాల్లో దేశీయ లిస్ట్ ఎ పోటీలు ఉన్నాయి. లిస్ట్ ఎ క్రికెట్‌లో ఓవర్ల సంఖ్య ఒక్కో జట్టుకూ నలభై నుండి అరవై ఓవర్ల వరకు ఉంటుంది, ఎక్కువగా యాభై ఓవర్లు ఉంటాయి.

క్రికెట్ మ్యాచ్‌లను "లిస్ట్ ఎ"గా వర్గీకరించడాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 2006 వరకు అధికారికంగా ఆమోదించలేదు.[4] ఈ వర్గీకరణను ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లకు నిర్ణయించిన విధంగానే నిర్ణయిస్తుంది.

ఫస్ట్-క్లాస్ క్రికెట్‌కు సమానమైన వర్గీకరణను వన్‌డే ఇంటర్నేషనల్‌ మ్యాచిలకు కూడా ఇవ్వడం కోసం, క్రికెట్ గణాంకవేత్తలు, చరిత్రకారుల సంఘం ఈ వర్గాన్ని సృష్టించింది. ప్రతి దేశంలో కొంత ముఖ్యమైన వన్డే పోటీలను, పర్యాటక టెస్టు జట్టుతో జరిగే మ్యాచ్‌లనూ మాత్రమే ఇందులో చేర్చారు. ఈ వర్గీకరణ చేసినది ఫిలిప్ బెయిలీ.

మ్యాచ్‌లను మూడు విభాగాలుగా చేసారు:

  • తుది జాబితాలో చేర్చవలసిన మ్యాచ్‌లు లిస్ట్ ఎ లో ఉంటాయి.
  • ఆటగాళ్ళు ఫస్ట్-క్లాస్ ప్రమాణాల్లో ఉంటారు గానీ, మ్యాచ్‌కి మాత్రం ఆ హోదా ఉండదు. ఇవి లిస్ట్ B లో ఉంటాయి. (ఉదా. ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు).
  • గతంలో లిస్ట్ ఎ మ్యాచ్‌లు ఆడిన జట్టు ఆడే ఇతర మ్యాచ్‌ల జాబితా లిస్ట్ C లో ఉంటాయి.[5]

లిస్ట్ ఎగా అర్హత పొందే మ్యాచ్‌లు

[మార్చు]
  • వన్డే ఇంటర్నేషనల్స్ (వన్‌డేలు)
  • కొన్ని ఇతర అంతర్జాతీయ మ్యాచ్‌లు
  • 12 ICC పూర్తి సభ్యులు ఆడే ప్రీమియర్ వన్డే టోర్నమెంట్లు
  • ప్రధాన ఫస్ట్-క్లాస్ జట్లతో పర్యాటక టెస్టు జట్టు ఆడే అధికారిక మ్యాచ్‌లు
  • ICC క్రికెట్ వరల్డ్ కప్ ఛాలెంజ్ లీగ్‌లోను ఆ పైనా, గతంలో ICC వరల్డ్ క్రికెట్ లీగ్‌లో పై స్థాయిలలోనూ ఆడిన మ్యాచ్‌లు

లిస్ట్ ఎగా అర్హత పొందని మ్యాచ్‌లు

[మార్చు]
  • ట్వంటీ 20 క్రికెట్, అంతర్జాతీయ టి20 లతో సహా. వీటిని విడిగా వర్గీకరించారు
  • ప్రపంచ కప్‌లో ఆడే వార్మప్ మ్యాచ్‌లు
  • ఇతర పర్యాటక మ్యాచ్‌లు (ఉదాహరణకు, ప్రధాన దేశీయ ఫస్ట్-క్లాస్ పోటీలో భాగం కాని, విశ్వవిద్యాలయాల జట్ల వంటి ఫస్ట్-క్లాస్ జట్లకు వ్యతిరేకంగా ఆడే మ్యాచ్‌లు)
  • పండుగ, స్నేహపూర్వక మ్యాచ్‌లు
  • ప్రామాణిక పరిస్థితుల్లో ఆడని మ్యాచ్‌లు (ఉదాహరణకు, ఒక్కో వైపు 11 కంటే ఎక్కువ మంది ఆటగాళ్లు ఉండడం)

మొదటి లిస్ట్ ఎ మ్యాచ్

[మార్చు]

1963 మేలో జిల్లెట్ కప్ ప్రిలిమినరీ రౌండ్‌లో లాంకషైర్, లీసెస్టర్‌షైర్ మధ్య జరిగిన మ్యాచ్‌ని మొట్టమొదటి 'లిస్ట్ ఎ' గేమ్‌గా గుర్తించారు.[6] ప్రతి జట్టు 65 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయగా, ఒక్కొక్క బౌలరుకు 15 ఓవర్ల పరిమితి విధించారు.[7]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Types of Cricket Matches". HowTheyPlay (in ఇంగ్లీష్). Retrieved 18 May 2019.
  2. "ICC Board appoints Afghanistan Working Group". International Cricket Council. Retrieved 17 November 2021.
  3. "ICC appoints Working Group to review status of Afghanistan cricket; women's First Class, List A classification to align with men's game". Women's CricZone. Retrieved 17 November 2021.
  4. "ICC clarifies what counts and what doesn't". Cricinfo. 30 July 2006. Retrieved 20 May 2009.
  5. "ListA Status". Association of Cricket Statisticians and Historians. 30 March 2015. Retrieved 12 January 2021.
  6. Lancashire v Leicestershire 1963
  7. "Opening Pandora's one-day box".