Jump to content

శ్లేషాలంకారము

వికీపీడియా నుండి

అనేకములగు అర్థములు వచ్చునట్లుగా వాక్యములందు శబ్దములను కూర్చుట శ్లేషాలంకారము అనబడును.

ఉదాహరణ: రాజు కువలయానందకరుడు.

వివరణ :-

రాజు = ప్రభువు, చంద్రుడు

కువలయము= భూమి, కలువ పూవు

ఈ పదములకు రెండు అర్థములు ఉండుట వలన

  1. ప్రభువు భూమికి ఆనందము కలిగించే వాడు అనీ
  2. చంద్రుడు కలువ పూలకు ఆనందము కలిగించే వాడు అనీ

రెండు అర్ధములు వస్తున్నాయి.'శ్లేష' సహాయంతో కవులు ద్వ్యర్థి, త్ర్యర్థి కావ్యాలు వ్రాసి నారు.

ప్రాచీన కవులలో శ్లేషాలంకారము ప్రయోగించిన వారిలో 17వ శతాబ్దానికి చెందిన చేమకూర వేంకటకవి ప్రసిద్ధి. ఈయన విజయ విలాసము అనే ప్రబందంను రచించాడు. మరియు పింగళి సూరనామాత్యుడు, రామరాజభూషణుడు ప్రసిద్ధులు.

20వ శతాబ్దంలో వాడుక భాషలో శ్లేషల ప్రయోగం

[మార్చు]

సాహితీవేత్తలు వాడుక భాషలో శ్లేషలు ప్రయోగించటం గురించి ఎన్నో కథనాలు వెలువడ్డాయి. మచ్చుకి ఒక ఉదాహరణ: ఒకసారి రైలు ప్రయాణంలో ఆరుద్ర స్నేహితుడు ఆయన్ను ఇలా అడిగాడు - మీకు ఈ ఊళ్ళో ఏమైనా భూములున్నాయా? అప్పుడే రైలుబండి శ్మశానం ప్రక్కగా పోసాగింది. అటు వైపుగా చూపిస్తూ ఆరుద్ర ఇచ్చిన సమాధానం - ఆ-రుద్ర భూములన్నీ నావే కదండీ!

  • ఒకరోజు ఒక పత్రికా సంపాదకుని కార్యాలయానికి వెళ్ళిన శ్రీశ్రీ ఆయన దీర్ఘంగా ఆలోచించడం గమనించి విషయమేమిటని అడిగారు. "ఈ సారి ముఖచిత్రం ఏమి వేయాలా అని ఆలొచిస్తున్నాను. కొచ్చిన్ సిస్టర్స్ వేద్దామా అనుకుంటున్నాను." దానికి శ్రీశ్రీ సమాధానం "ఎందుకొచ్చిన్ సిస్టర్స్?"
  • ఒక స్నేహితుడు శ్రీశ్రీని ఒక నాటకం వ్రాసి పెట్టమని కోరారు. దానికి శ్రీశ్రీ జవాబు: "ఏ నాటికైనా వ్రాస్తాను మిత్రమా."
  • శ్రీశ్రీని రైల్వేస్టేషన్లో చూసిన ఒక మిత్రుడు అడిగిన ప్రశ్న - "ఊరికేనా?" దానికి శ్రీశ్రీ సమాధానం - "ఆ... ఊరికే..."