Jump to content

తెలుగు నాటకరంగం

వికీపీడియా నుండి
(నాటకాలు నుండి దారిమార్పు చెందింది)
ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల్లో భాగంగా 2019 ఆగస్టు 31న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన జానపద జాతర సాంస్కృతిక కార్యక్రమంలో చిందు యక్షగాన కళాకారుల ప్రదర్శన

నాటకం అనేది ఒక శ్రవణ సహిత దృశ్యరూపకం. జానపద కళలు విలసిల్లుతున్న రోజులలో, రాజుల పరిపాలనా కాలంలో ప్రజల వినోదం కోసం అత్యధికంగా ఆదరింపబడిన కళ నాటకం. నాటకం సంగీతం, పాటలు, నృత్యాలతో కూడుకొన్న ప్రక్రియ. యక్షగానానికి రూపాంతరమైన నాటకానికి సూత్రధారుడే ఆయువుపట్టు. ఇందులోని పాత్రలన్నీ తమను తామే పరిచయం చేసుకొంటూ రంగప్రవేశం చేస్తాయి.

పదహారవ శతాబ్దంలో ప్రారంభమైన నాటక ప్రక్రియను చిందు భాగవతము యక్షగాన నాటకం, వీధి భాగవతం, బయలాట అనీ పిలుస్తారు. వీధి నాటకాలను ఎక్కువ ప్రచారంలోకి తెచ్చినవారు కూచిపూడి భాగవతులు. కాకతీయుల కాలంలో ప్రదర్శించిన క్రీడాభిరామం కూడా ఒక నాటకమే. తెలుగు నాటకరంగ చరిత్ర, తెలుగులో ఆదికవిగా పేరుగాంచిన నన్నయ్య తన భారత అవతారికలో రసాన్విత కావ్యనాటకముల్ పెక్కుజూచితి అనడాన్ని బట్టి, నన్నయ కాలానికి నాటక ప్రదర్శనలుండేవని అర్ధం చేసుకోవచ్చు.

తెలుగు నాటకరంగ చరిత్ర

[మార్చు]

"నాటకాంతం హి సాహిత్యం" అన్నాడు మహాకవి కాళిదాసు. అంటే అన్ని సాహిత్య ప్రక్రియలలోనూ చివరిగా స్పర్శించవలసిన అంకం నాటకమని అర్ధం. కవిత్వం, వ్యాసం, కథ... ఇలా అన్ని సాహిత్య ప్రక్రియలను స్పృశించిన తరువాత మాత్రమే నాటకాన్ని రచించాలని ఆయన తెలిపాడు. అప్పుడు మాత్రమే నాటక రచనకు నిండుదనం చేకూరుతుందని ఆయన భావన. ప్రపంచ సాహిత్యంలో "మాళవికాగ్నిమిత్రం", "అభిజ్ఞాన శాకుంతలం" వంటి నాటకాల ద్వారా చిరస్థాయిగా నిలిచిపోయిన కాళిదాసు అభిప్రాయం నూటికి నూరుపాళ్ళూ నిజమని ఆధునిక రచయితలు మనస్ఫూర్తిగా అంగీకరిస్తారు. నాటకానికి అంత శక్తి ఉంది. కాబట్టే, "నాటకం రసాత్మకం కావ్యం" అన్నాడు.[1]

మహాభారతం నాటకంలో భాగంగా అర్జునుడు తపస్సు మాను ఎక్కుట అనే దృశ్యం. మొగరాల గ్రామంలో తీసిన చిత్రము

తెలుగు నాటక రచన ఆధునిక కాలంలోనే ప్రారంభమైనట్టుగా పలువురు భావిస్తారు. పలువురు పూర్వ నాటకకర్తలు సంస్కృతంలోనే నాటకాలు రాయడం, ఆధునిక యుగారంభంతో నాటక రచన, ప్రదర్శనల ఉధృతి పెరగడం వంటివి ఈ అభిప్రాయానికి కారణాలు కావచ్చు. అయితే వినుకొండ వల్లభరాయుడు (గ్రంథకర్తృత్వంలో వివాదం ఉంది) క్రీడాభిరామం పేరిట రచించిన కృతి వీధినాటకమే. కానీ పలువురు పండితులు దీని ప్రదర్శన యోగ్యతపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.[2] తెలుగు నాటక రచన ఆవిర్భావానికి దేశంలో విశ్వవిద్యాలయాల ఏర్పాటు చేయడం ప్రధాన కారణమని చెప్పవచ్చు. 1857లో ముంబై, చెన్నై మహానగరాలలో భారత దేశంలోని మూడు ప్రధాన విశ్వ విద్యాలయాల అంకురార్పణ జరగడంతో ఆంగ్ల విద్యావ్యాప్తి శీఘ్రగతిని పురోగమించింది. ఇది దేశభాషలలో పండితులపై ప్రభావాన్ని చూపింది. వీరు తమ భాషలో లేని సాహిత్య ప్రక్రియలను క్రొత్తగా అవతరింపజేయడానికి పూనుకున్నారు. ఈవిధంగా తెలుగుదేశంలో ఆధునిక నాటక రచన ప్రదర్శనలకు దారితీసినవారు పాఠశాలల్లో, కళాశాలల్లో పనిచేసిన ఉపాధ్యాయులు, ప్రధానంగా పండితులు. అటువంటివారిలో కోరాడ రామచంద్రశాస్త్రి, కొక్కొండ వెంకటరత్నం పంతులు, పరవస్తు వెంకట రంగాచార్యులు, వావిలాల వాసుదేవశాస్త్రి ఆధునిక తెలుగు నాటక రచనా ప్రారంభ విషయాన ప్రథములు. కందుకూరి వీరేశలింగం, కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి, నాదెళ్ళ పురుషోత్తమ కవి, వడ్డాది సుబ్బారాయుడు ఆధునిక తెలుగు నాటక ప్రదర్శనారంభ విషయంలో ప్రథములు.

ఆధునిక నాటక రచన 1860 ప్రాంతాల్లో ఆరంభంకాగా నాటక ప్రదర్శన మాత్రం 1880 లో ప్రారంభమయ్యింది. ఆధునిక కాలంలో వెలువడిన తొలి తెలుగు నాటకం "మంజరీ మధుకరీయము". దీనిని కోరాడ రామచంద్రశాస్త్రి 1860 ప్రాంతాల్లో రచించాడు.[3] ముద్రణ మాత్రం 1908లో జరిగింది. సంస్కృతంలోనుంచి నాటక లక్షణాలను అనుసరించి తెలుగులో వెలువడిన స్వతంత్ర రచన ఇది. అదేవిధంగా 'ఆంధ్రా జాన్సన్‌ 'గా సుప్రసిద్ధులైన కొక్కొండ వెంకటరత్నం పంతులు 1871 ప్రారంభంలో ఆంధ్రుడైన వారణాశి ధర్మసూరి సంస్కృతంలో రచించిన "నరకాసుర విజయము" అనే వ్యాయోగమును ఆంధ్రీకరించాడు. ఇది 1872 లో ప్రకటితమయింది. అదే విధంగా రిఫార్మర్ పండిట్ అని ప్రసిద్ధికెక్కిన పరవస్తు వెంకట రంగాచార్యులు 1872 ప్రాంతాల్లో కాళిదాసు రచించిన "అభిజ్ఞాన శాకుంతలము"ను ఆంధ్రీకరించడం జరిగింది. ఇదిలావుంటే వావిలాల వాసుదేవశాస్త్రి ఆంగ్ల నాటక ఆంధ్రీకరణకు మార్గం వేశాడు. జూలియస్ సీజర్ నాటకాన్ని "సీజరు చరిత్రము" అను పేరుతో 1874 లో ఆసాంతం తేటగీతిలో ఆంధ్రీకరించాడు. ఇది 1876 లో ప్రకటితమయింది. తెలుగులో పద్య నాటకాన్ని, విషాదాంత నాటకాన్ని రచించినవారిలో వాసుదేవశాస్త్రి ప్రథముడు.

ఆధునిక నాటక రచనకు ఆద్యులు వారైతే, ఆధునిక నాటక ప్రదర్శన ఆరంభ దశకు కందుకూరి వీరేశలింగం పంతులు, కొండుభొట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి, నాదెళ్ళ పురుషోత్తమకవి, వడ్డాది సుబ్బారాయుడులు రూపకర్తలు. వీరేశలింగం సంభాషణ రూపాన "బ్రాహ్మ వివాహము" అను ప్రహసనమును తన "హాస్య సంజీవని" అను పత్రికలో రచించాడు. అనంతరం "వ్యవహార ధర్మబోధిని" అనే నాటకాన్ని ప్రకటించాడు. ఇది వ్యావహారిక భాషలో రచించబడింది. వ్యావహారిక భాషలో ఆసాంతం రచన సాగించడం ఆనాడు ఒక సాహసం. పైగా ప్రదర్శన భాగ్యం పొందిన తొలి తెలుగు నాటకమిది. 1880 లో వీరేశలింగం నాటక సమాజాన్ని స్థాపించి "రత్నావళి", "చమత్కార రత్నావళి" అను రెండు నాటకాలను ప్రదర్శించాడు. తెలుగునాట తొలి నాటక సమాజాన్ని స్థాపించిన ఘనత వీరేశలింగందే. ఇతడి స్వతంత్ర రచన అయిన "వ్యవహార ధర్మబోధిని", సంస్కృత నాటక అనువాదమైన "రత్నావళి", ఆంగ్ల నాటక అనుసరణ అయిన "చమత్కార రత్నావళి" ప్రదర్శన భాగ్యం పొందిన తొలి తెలుగు నాటకాలు. ఇది 1880 లో జరిగింది. అందుచేత 1980 వ సంవత్సరం తెలుగు నాటకరంగ శతజయంతి సంవత్సరం అయింది.

తెలుగు నాటకాలలో పద్య పఠనమును (ఈనాడు వలె గానం కాదు) ప్రవేశపెట్టినవారు వ.సు. కవిగా పేరొందిన వడ్డాది సుబ్బారాయుడు. వీరి నాటకాలలో ప్రసిద్ధమైనది "వేణీ సంహారము". ఇది 1883 లో ప్రకటితమైంది. ఇది సంస్కృతంలో భట్టనారాయణుడు రచించిన "వేణీ సంహార" నాటకానికి ఆంధ్రీకరణ. మూలం వలెనే తెలుగులో కూడా గద్య, పద్యాత్మకమే. ఈ పద్యాలని రంగస్థలం మీద పఠించేవారు. 1884-86 మధ్య నాదెళ్ళ పురుషోత్తమ కవి 32 హిందూస్తానీ నాటకాలు రచించాడు. వీటిని 15 ఏళ్ళపాటు అనేక పట్టణాలలో విజయవంతంగా ప్రదర్శించారు. పాత్రోచిత భాష, అనుప్రాసయుక్తము ప్రాబంధికము అయిన శైలి ఇతడు పాటించిన అంశాలు. పాటలు (టపాలు) పాడుట ఇతడు ప్రవేశపెట్టిన క్రొత్త అంశము. ఈ మూడు అంశాలు కాలక్రమంలో తెలుగు నాటక రంగం మీద ప్రాధాన్యం వహించాయి. 1886 వరకు తెలుగు నాటక రంగం సర్కారు జిల్లాలకు, అందునా కృష్ణ, గోదావరి మండలాలకు ప్రధానంగా పరిమితమై ఉంది. 1887 నుండి బళ్ళారి సీమ వెలుగులోకి వచ్చింది. ధర్మవరం రామకృష్ణమాచార్యులు వారు తన తొలి తెలుగు నాటకమైన "చిత్రనళీయం"‌ను బళ్ళారిలో 1887 జనవరి 29న విజయవంతంగా ప్రదర్శించారు. నాటక భాషగా తెలుగు పనికిరాదన్న భావం ఆనాడు బళ్ళారి సీమలో ప్రబలివుంది. కాని "చిత్రనళినీయం" విజయవంతం కావడంతో బళ్ళారి కన్నడ సీమ కాదన్న భావం ప్రబలమైంది. రామకృష్ణమాచార్యులవారు 30 నాటకాలు రచించారు. అన్నీ స్వతంత్ర రచనలే. వీరు తన నాటకాలలో పాటలు ప్రవేశపెట్టారు. అంతేకాకుండా పద్యాలను రాగయుక్తంగా పాడడం కూడా ప్రవేశపెట్టారు. వీరి "సారంగధర" తెలుగులోని తొలి స్వతంత్ర విషాద రూపకం. వీరికి ముందు తెలుగు నాటక రచనకు సుప్రసిద్ధమైన మార్గం లేదు. ప్రాచ్య-పాశ్చాత్య సిద్ధాంతాలను సమన్వయించడంలో వీరు ప్రథములై విలసిల్లారు. అందుకే వీరిని "ఆంధ్ర నాటక పితామహ" అని బిరుదునిచ్చి సత్కరించారు.

ప్రముఖ హాస్య రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం 1989లో నాటక రచన ఆరంభం చేశారు. వీరి నాటకాలలో "గయోపాఖ్యానం" సుప్రసిద్ధమైనది. 1891లో "నాగానంద" ఆంధ్రీకరణతో తెలుగు నాటకరంగమందు అడుగుపెట్టిన వేదం వెంకటరాయశాస్త్రి గారు రచించిన "ప్రతాపరుద్రీయం" బహుళ ఖ్యాతినొందింది. కల్పనా శక్తి రచయితకు సాహిత్య రంగంలో ఎంతటి ఉన్నత స్థానాన్ని అందిస్తుందో ఈ నాటకమే ప్రత్యక్ష ఉదాహరణ. ఈ నాటకంలో వీరి కల్పిత పాత్రైన యుగంధర మంత్రి చారిత్రక పురుషుడుగా ఆంధ్ర సారస్వతంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. అట్లే పేరిగాడు, విద్యానాధుడు, చెకుముకు శాస్త్రి, ఎల్లి మొదలగు పాత్రలు వీరి రచనా చమత్కారం వలన చిరస్మరణీయమైన పాత్రలుగా రూపొందారు.

1887లో ప్రకటితమైన గురజాడ అప్పారావుగారి "కన్యాశుల్కం" వ్యావహారిక భాషలో రచించబడ్డ అత్యుత్తమైన నాటకం. 1892 ఆగస్టులో విజయనగరంలోని జగన్నాధ విలాసినీ నాటక సమాజం వారు దీనిని ప్రథమంగా విజయవంతంగా ప్రదర్శించారు. వ్యావహారిక భాషలో ఓ కొత్త మలుపు తెచ్చిన నాటకమిది. "ప్రతాపరుద్రీయం", "కన్యాశుల్కం" రెండు రాత్రుల రూపకాలు కాగా 1894 ప్రాంతాల నుంచి వివిధ నాటక రచనలు చేసినవారు కోలాచలం శ్రీనివాసరావుగారు. వీరు అధికంగా చారిత్రక నాటకాలు రచించడంచేత "చారిత్రక నాటక పితామహుడు"గా పేరొందారు. వీరి నాటకాలలో "కర్ణాటక రాజ్యనాశము" లేదా "రామరాజు చరిత్రము"నకు తెలుగుదేశమంతటా విశేష ప్రాచుర్యం తెచ్చినవారు ఆచార్యులవారి మేనల్లుడైన బళ్ళారి రాఘవ.[4]

అదేవిధంగా పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు రచించిన తొలి నాటకం "నర్మదాపురుకుత్సీయము" 1900లో ప్రకటితమైంది. 30కి పైగా స్వతంత్ర నాటకాలు రచించిన వీరికి షేక్‌స్పియర్ ఆదర్శం. వీరి వచన రచన వ్యావహారికానికి దగ్గరగా ఉండే సరళ గ్రాంధికం. వీరి రచనలలో లోకోక్తులు, పలుకుబడులు అధికం. వీరి నాటకాలలో "రాధాకృష్ణ", "పాదుకాపట్టాభిషేకం", "కంఠాభరణము" ప్రసిద్ధమైనవి. "కంఠాభరణము" తెలుగులో పరిపూర్ణమైన స్వతంత్ర స్వతంత్ర ప్రహసనము. 1900 నాటికి తెలుగు నాటక రచన, ప్రదర్శన వ్యాసంగాలు తెలుగుదేశంలోని అన్ని ప్రాంతాలకూ వ్యాపించాయి. 1906-20 మధ్య ఒకరు నాటకీకరించిన కథనే స్వీకరించి పలువురు అనువదించుట, ఒకరు నాటకీకరించిన కథనే స్వీకరించి పలువురు నాటకాలు రాయడం జరిగింది. ఈవిధంగా ఈ కాలంలో బయల్దేరిన "హరిశ్చంద్ర" నాటకాలు 13. "సారంగధర 8. ఇంకా అనేక ఇతర నాటకాలు. ధర్మవరం రామకృష్ణమాచార్యులవారి ప్రభావం వల్ల నాటకాలలో పద్యాలకు, పాటలకు విలువ హెచ్చిన కాలమిది. ఈ కాలంలోని ముఖ్య విశేషం తెలుగుదేశంలో వ్యాపార నాటకరంగం విజృంభించడం.

1913 ప్రాంతాల్లో కృష్ణా మండలంలో నాటక పోటీలు ప్రారంభమై దేశమంతటా వ్యాపించాయి. "గయోపాఖ్యానం", "పాండవ ఉద్యోగ విజయములు", "బొబ్బిలి యుద్ధం", "రంగూన్ రౌడి" మొదలగు నాటకాలకు విడివిడిగా పోటీలు జరిగాయి. ఈ కాలంలోని మరో విశేషం ప్రహసనాల ఆవిర్భావం. నాటక ప్రదర్శనం మధ్యలో ప్రహసనాలను ప్రదర్శించడం ధార్వాడ నాటక సమాజంనుంచి వచ్చిన సంప్రదాయం. నాటక రంగాలను మార్పు చేసే సమయంలో సీనరీలను ఏర్పాటు చేసుకోవడం చేత ప్రేక్షకులను ఈలోపు వినోదపరచడానికి ప్రహసనాలు అవసరమయ్యాయి. 1929లో ఆంధ్ర నాటక కళా పరిషత్తు తెనాలిలో స్థాపించబడింది. ఇందులో ప్రదర్శించాలంటే ఐదేళ్ళ క్రితం రాసిన నాటకం పనికిరాదు. ఏటేటా పరిషత్తు వేర్వేరు పట్టణాల్లో జరగాలి. ఒక నటుడు ఒక నాటకం, నాటికలోనే పాల్గొనాలి. స్త్రీ పాత్రలు స్త్రీలే పోషించాలి. ఈ పరిషత్తు స్థాపన కొత్త రచయితల ఆవిర్భావానికి నాంది పలికింది. 1930 నుంచి సాంఘిక నాటకోద్యమం విజృభించింది. "విశ్వశాంతి", "ఎన్.జీ.ఓ.", "మా భూమి", "కీర్తిశేషులు", "నిర్మల" "కుక్క" వంటి నాటక రచనల ద్వారా రచయితలు సమాజంలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

1935-44 మధ్య కాలంలో రేడియో రూపకం ఆవిర్భవించి అభివృద్ధి చెందింది. స్వాతంత్ర్యోద్యమానికి సమకాలికంగా సంఘ సంస్కరణోద్యమం కూడా దేశవ్యాప్తంగా సాగింది. సాంఘిక దురాచారాలను ఖండిస్తూ అనేక నాటకాలు వెలువడ్డాయి. వాటిలో కాళ్ళకూరి నారాయణరావు రచించిన "చింతామణి", "వరవిక్రయం", "మధుసేవ" సమస్యల ఆలంబనగా వెలసిన నాటకాలు. ఇలా వుండగా సంప్రదాయాల ఆధిక్యాన్ని రూపుమాపడం కోసం రచనలు చేసినవారు త్రిపురనేని రామస్వామి, ముద్దుకృష్ణ, గుడిపాటి వెంకట చలం, ఆమంచర్ల గోపాలరావు మొదలగువారు. ఈ కాలంలో దువ్వూరి రామిరెడ్డి గారి "కుంభరాణా", విశ్వనాథ సత్యనారాయణ వారి "నర్తనశాల" ఉత్తమ విషాద రూపకాలు. 1930 తర్వాత ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి సంబంధించిన నాటకాలు కూడా వెలిశాయి. 1944-45 తరువాతి కాలాన్ని నాటక/నాటిక పోటీల యుగం అనవచ్చు. 1937 నుంచి రేడియో నాటికలు, 1944-45 నుంచి రంగస్థల ఏకాంకికలు పుంఖానుపుంఖాలుగా వెలువడుతున్నాయి. 1964లో ఎన్.ఆర్.నంది రచించిన "మరో మొహెంజొదారో" నాటకం ద్వారా తెలుగు నాటక ప్రయోగంలో "ఫ్రీజ్" ప్రవేశించింది.

ఆ తరువాత లెక్కలేనన్ని ప్రయోగాలు ఆధునిక నాటకరంగాన్ని వరించాయి. సాంఘిక నాటకాలలో లేజర్ టెక్నిక్‌ను వాడడం ద్వారా సైంటిఫిక్ పోకడలను సైతం గ్రహించి నాటకాలను ప్రదర్శిస్తున్నారు. నాటక ప్రక్రియలో పూర్వం నాటకాలు దేవుళ్ళు, దైవాంశ సంభూతులు, దైవ ప్రతినిధులనబడే రాజుల గురించి మాత్రమే వుండేవి. ఆ స్థితి నుంచి సమాజంలోని జన బాహుళ్య సమస్యల గురించి పట్టించుకోని ఆలోచింపజేసే నాటకాలు రావడం ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే "నంది నాటకోత్సవాలు" ఆంధ్ర నాటకరంగానికి ప్రోత్సాహమిస్తూ ప్రపంచ రంగస్థల చరిత్రలో తెలుగు నాటకరంగ సర్వతోముఖ వికాసానికి దోహదపడుతూ ప్రపంచ ఖ్యాతిని తీసుకొస్తున్నాయి. ఏది ఏమైనా సామాన్య తెలుగు వాడి ఆదరణ ఉన్నంతవరకు తెలుగు నాటకరంగం దేదీప్యమానంగా వెలుగుతందనడంలో సందేహం లేదు. నాటకాన్ని అమితంగా ఆదరించే తెలుగు ప్రజలకే ఈ ఖ్యాతి దక్కుతుంది.[5][6]

ఆంధ్రప్రదేశ్ సచివాలయ సాంస్కృతిక సంఘం వారు ప్రదర్శించిన శ్రీకృష్ణరాయబారం పౌరాణిక నాటకంలోని ఒక దృశ్యం

తెలుగు నాటక సంస్థలు

[మార్చు]

తెలుగు నాటకరంగం ప్రారంభం నుండి ఇప్పటివరకు ఎన్నో నాటక సంస్థలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. వీటిలో కొన్ని ఆదరణ లేకనో, ఆర్థిక భారం వల్లనో కనుమరుగయ్యాయి. కొన్ని మాత్రం ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలనుండి ఆర్థిక సహాయం పొందుతూ నడుస్తున్నాయి.

నాటకపరిషత్తులు

[మార్చు]

రంగస్థలానికి ఆదరణ తగ్గుతూ వస్తోంది. కావ్యేషు నాటకం రమ్యం నాటక రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నంది అవార్డులు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. పూర్వం బాపట్లకు చెందిన ఈలపాట రఘురామయ్య, కృష్ణుడిగా తెనాలికి చెందిన ఎ.వి.సుబ్బారావు, మాయలఫకీరుగా కొలకలూరుకు చెందిన వల్లూరి వెంకట్రామయ్య చౌదరి లాంటి ఎందరో కళాకారులు. ప్రతి మండల కేంద్రంలో ఆరుబయట రంగస్థల వేదికలు నిర్మిస్తామని ప్రభుత్వం దశాబ్దాలుగా చెబుతోంది. రాష్ట్రంలో ఏటా జరిగే సుమారు 70 పరిషత్తులకు ప్రదర్శనలు సిద్ధం చేసుకోవాలంటే రిహార్సల్సు కోసం ఒక్క వేదిక కూడా అందుబాటులో లేని దుస్థితి కళాకారులది. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, కేరళ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు నాటక రంగానికి ఇచ్చే చేయూత కారణంగానే అక్కడి ప్రదర్శనలు సాంకేతికంగా కూడా ప్రగతి సాధిస్తున్నాయి. సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే కళారంగంవైపు నేటి యువత కన్నెత్తి చూడటం లేదు.

నాటకోత్సవాలు

[మార్చు]

నంది నాటకోత్సవాలు

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా నంది నాటకోత్సవాలు నిర్వహిస్తున్నది. నాటకోద్దరణలో భాగంగా లక్షల రూపాయలు వెచ్చించి, ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తూ, బహుమతి ప్రదానం చేస్తున్నారు ఈ సంవత్సరం దీనిని కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో ఫిబ్రవరి 19-27 తేదీలలో నిర్వహించింది. నవనందుల ఆలయ ప్రాంతం నంద్యాలలో తొమ్మిది రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో పది పద్యనాటకాలు, ఎనిమిది సాంఘిక నాటకాలు, పన్నెండు సాంఘిక నాటికలు, 12 బాలల నాటికలు ప్రదర్శితమయ్యాయి. చిన్నా, పెద్దా అందరూ కలసి దాదాపు 1,300 మంది కళాకారులు పాల్గొన్న ఈ ప్రదర్శనలను వేలాదిమంది ప్రేక్షకులు వీక్షించారు.

వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక

[మార్చు]

ఈ సంస్థ గత ఎనిమిదేళ్ళుగా నాటిక పోటీలు నిర్వహిస్తున్నది. కార్యదర్శి కాసిపేట తిరుమలయ్య. 2003వ సం.లో గుంటూరు కేంద్రంగా ప్రారంభింపబడ్డ ఆంధ్రప్రదేశ్ రంగస్థల కళకారుల ఐక్యవేదికకు వరంగల్ జిల్లా శాఖగా తొలినాళ్ళలో ప్రారంభింపబడి,'రంగస్థల కళాకారుల క్రెడిట్ సొసైటీ' స్థాపన ద్వారా, స్వయం సమృద్ధిని సాధించుకొని, గత యేడు 'వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక' గా రిజిష్టర్ చేయింపబడింది. డాక్టర్.భండారు ఉమామహేశ్వరరావు అధ్యక్షులుగా, శతపతి శ్యామలరావు కార్యదర్శిగా తొలి మూడేళ్ళూ ఎన్నో కార్యక్రమాలను రూపొందించారు. అందులో ముఖ్యమైనవి తెలంగాణాస్థాయి నాటిక పోటీలు, కళాకారుల క్రెడిట్ కార్పొరేషన్. 50 మంది సభ్యులుగా చేరిన ఈ కార్పొరేషన్ లాభాల్లోనుండి సగాన్ని నాటకరంగ అభ్యున్నతికి వినియోగిస్తారు. సంస్థ నిర్వహించే నాటిక పోటీలను, దాతలు, ప్రాయోజకులు అందించే ఆర్థిక సహకారంతో నిర్వహిస్తారు. విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ కళాసామ్రాట్ పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ గౌరవ అధ్యక్షులుగా ఉన్న ఈ సంస్థకు, వనం లక్ష్మీకాంతరావు, బోయినపల్లి పురుషొత్తమరావు, డా.భండారు ఉమామహేశ్వరరావు వంటి అనుభవజ్ఞులు తమ సలహాలను, సూచనలను అందిస్తున్నారు. సోదరసభ్యులు యెలిగేటి సాంబయ్య, సి.హెచ్.ఎస్.ఎన్.మూర్తి, శతపతి శ్యామలరావు, వేముల ప్రభాకర్, జె. ఎన్. శర్మ, జీ.వీ.బాబు, బి.శ్రీధరస్వామి, రామనరసింహ స్వామి, రాగి వీరబ్రహ్మాచారి, మట్టెవాడ అజయ్, రంగరాజు బాలకిషన్, సామల లక్ష్మణ్, ఆకుతోట లక్ష్మణ్, కళా రాజేశ్వరరావు, ఎన్.ఎస్.ఆర్.మూర్తి, జి.రవీందర్, దేవర్రాజు రవీందర్ రావు, ఆకుల సదానందం, యం.వి.రామారావు, సోల్జర్ షఫి మొహమ్మద్ తమ సహకారాన్ని అందిస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పడుతున్నారు.

తెలంగాణ రంగస్థల సమాఖ్య (తెర)

[మార్చు]

తెలంగాణ ప్రాంత నాటక చరిత్రను నాటకాలను అధ్యయనం చేయడంతోపాటు తెలంగాణ ప్రాంత నాటకరంగ అభివృద్ధికోసం నాటకమిత్రులు కలిసి ప్రారంభించిన సంస్థ తెలంగాణ రంగస్థల సమాఖ్య (తెర). దీని అధ్యక్షులు చిలుకమఱ్ఱి నటరాజ గోపాల మూర్తి, ప్రధాన కార్యదర్శి డా. మల్లేశ్ బలష్టు, కోశాధికారి ప్రణయ్‌రాజ్ వంగరి. తెర ప్రారంభ సంవత్సరంలో తెలంగాణ నాటకరంగ చరిత్ర స్థితిగతులపై జాతీయ స్థాయి నాటక సదస్సును నిర్వహించింది. తరువాత తెలంగాణ యువ నాటకోత్సవం నిర్వహించింది.

తెలుగు నాటకరంగం - ప్రయోగాలు

[మార్చు]

నాటకాలు కళాకారులు

[మార్చు]

తెలుగు నాటకాలు

[మార్చు]

నటీనటులు

[మార్చు]

కొందరు ముఖ్యమైన నటీనటులు :

నాటక రచయితలు

[మార్చు]

నాటక దర్శకులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  1. హరిశ్చంద్ర రాయల
  2. మురళీ బాసా
  3. చిలుకమఱ్ఱి నటరాజ గోపాల మూర్తి.

ఇతర భాషల నాటక ప్రముఖులు

[మార్చు]
  1. అయనెస్కో యూజీన్, (ఫ్రెంచి భాష నాటక రచయిత)

ఇవి కూడా చూడండి

[మార్చు]

ఇంకా చదవండి

[మార్చు]
  • నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణ, 1998, 2006.

మూలాలు

[మార్చు]
  1. డా. మామిడి, హరికృష్ణ (2024-03-28). "సాహిత్య శిఖర రూపం.. నాటకం!". www.dishadaily.com. Archived from the original on 2024-03-29. Retrieved 2024-03-29.
  2. క్రీడాభిరామం:పీఠిక:బి.వి.సింగరాచార్యులు;ఎమెస్కో ప్రచురణ:
  3. సాక్షి, ఫన్ డే (ఆదివారం సంచిక) కవర్ స్టోరి (24 March 2019). "అమ్మా రంగ‌స్థ‌లం నీకు శ‌త‌కోటి చ‌ప్ప‌ట్లు". Archived from the original on 24 మార్చి 2019. Retrieved 24 March 2019.
  4. తెలుగు వెలుగు, వ్యాసాలు. "నాటకానికి అడుగుజాడ కందుకూరి". www.teluguvelugu.in. డా. కందిమళ్ళ సాంబశివరావు. Archived from the original on 23 ఏప్రిల్ 2020. Retrieved 23 April 2020.
  5. నమస్తే తెలంగాణ, నిపుణ విద్యావార్తలు (15 June 2016). "తెలుగు సాహిత్య ప్రక్రియలు - నాటకం". www.ntnews.com. డా. తుండు కృష్ణ కౌండిన్య. Archived from the original on 19 ఆగస్టు 2019. Retrieved 19 August 2019.
  6. ప్రజాశక్తి, ఫీచర్స్ (8 May 2019). "తొలినుంచి ప్ర‌జా ప‌క్ష‌మే!". www.prajasakti.com. వల్లూరి శివప్రసాద్‌. Archived from the original on 19 ఆగస్టు 2019. Retrieved 19 August 2019.

బయటి లింకులు

[మార్చు]