Jump to content

చైనా సాంస్కృతిక విప్లవం

వికీపీడియా నుండి

చైనా సాంస్కృతిక విప్లవం అనేది చైనా దేశంలో వచ్చిన సాంఘిక రాజకీయ విప్లవం. దీనిని మావో జెడాంగ్ 1966 లో ప్రారంభించాడు. అది 1976లో ఆయన చనిపోయేదాకా కొనసాగింది. ఈ విప్లవం ప్రధాన లక్ష్యం పెట్టుబడిదారీ విధానాన్ని, చైనాలో సాంప్రదాయిక కట్టుబాట్లు నిర్మూలించి కమ్యూనిజాన్ని ముందుకు తీసుకు వెళ్ళడం. ఇది అనుకున్న ప్రధాన లక్ష్యాలను సాధించలేకపోయినా అప్పటిదాకా పక్కనబెట్టేసిన మావోను మళ్ళీ అధికారం చేజిక్కుంచుకునేలా చేసింది.

మే నెల 1966లో మావో తన సాంస్కృతిక విప్లవ దళం (Cultural Revolution Group) సహాయంతో ఒక ఉద్యమాన్ని లేవదీశాడు. కొన్ని బూర్జువా శక్తులు ప్రభుత్వంలో, సమాజంలో చేరి పెట్టుబడిదారీ విధానాన్ని తిరిగిరప్పించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించాడు. ముఖ్యంగా యువతను తిరగబడటం మన ధర్మం అంటూ ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించమని ఉసికొల్పాడు. ఆగస్టు 1966 లో బీజింగ్ నగరంలో పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగింది. దేశవ్యాప్తంగా చాలామంది యువత, ముఖ్యంగా విద్యార్థులు రెడ్ గార్డు (ఎర్ర సైన్యం) పేరుతో బృందాలుగా ఏర్పడ్డారు. మావో సూక్తులలో కొన్నింటిని గుదిగుచ్చి లిటిల్ రెడ్ బుక్ పేరుతో ప్రచురించారు. ఉద్యమకారులందరికీ అది ఒక పవిత్ర పుస్తకమైంది. 1967కి బాగా బలం పుంజుకున్న ఈ సైన్యం ప్రాంతీయ ప్రభుత్వాలను, పార్టీ విభాగాలను కూలదోసి వాటి స్థానంలో విప్లవ కమిటీలను నియమించారు. కొద్దికాలానికే ఈ కమిటీలలో ముఠాలుగా ఏర్పడ్డి, వాళ్ళలో వాళ్ళే సాయుధపోరాటాలు మొదలుపెట్టారు. 1971లో లిన్ బావో ప్రభుత్వం కూలిపోవడంతో 1972 లో గ్యాంగ్ ఆఫ్ ఫోర్ గా పేరు గాంచిన జియాంగ్ కింగ్ (మావో భార్య), జాంగ్ చుంకియావో, యావో వెన్యువాన్, వాంగ్ హాంగ్వెన్ ప్రాముఖ్యం సంపాదించుకున్నారు. ఈ విప్లవం 1976లో మావో మరణించేదాకా సాగింది. తర్వాత గ్యాంగ్ ఆఫ్ ఫోర్ ను అరెస్టు చేశారు.

చైనా చరిత్రలో ఈ విప్లవాన్ని పదేళ్ళ అరాజకత్వం అని పేర్కొనడం కద్దు.[1][2]

నేపథ్యం

[మార్చు]

పీపుల్స్ రిపబ్లిక్ స్థాపన

[మార్చు]

అక్టోబరు 1, 1949 న మావో జెడాంగ్ చైనా అంతర్యుద్ధం ముగింపుకు గుర్తుగా పీపుల్స్ రిపబ్లిక్ ను ప్రకటించాడు. మిగిలిన రిపబ్లిక్ దళాలు తైవాన్ కు పారిపోయి అక్కడి నుంచే పీపుల్స్ రిపబ్లిక్ ను వివిధ రకాలుగా నిరోధించడానికి ప్రయత్నించాయి. రిపబ్లికన్ సైనికులు చాలామంది చైనాలో మిగిలిపోయారు. అప్పుడే మావో జెడాంగ్ తిరగబడే అవకాశం ఉన్న విప్లవకారులనూ, చైనా సమాజంలో తన కొత్త ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్న వారిని అణిచివేయడానికి ఒక ప్రచారం ప్రారంభించాడు. ఈ ప్రచారంలో భాగంగా తొలుత చైనా అంతటా భాగంగా చెలరేగిన మూకుమ్మడి నిర్బంధాలు, హత్యలే తర్వాత సాంస్కృతిక విప్లవానికి నాంది పలికాయి.

మూలాలు

[మార్చు]
  1. "Translation Glossary for the CR/10 Project" (PDF). University of Pittsburgh. Retrieved November 28, 2023.
  2. Lu, Xing (2004). Rhetoric of the Chinese Cultural Revolution: The Impact on Chinese Thought. p. 2. Known to the Chinese as the ten years of chaos [...]