Jump to content

గద్వాల రైల్వేస్టేషన్

వికీపీడియా నుండి
గద్వాల రైల్వేస్టేషను

గద్వాల రైల్వేస్టేషను మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైల్వేస్టేషను. ఇది దక్షిణమధ్య రైల్వే జోన్ లోని హైదరాబాదు డివిజన్ లో, సికింద్రాబాదు-డోన్ సెక్షనుపై ఉంది. ఈ స్టేషను సికింద్రాబాదు నుంచి దక్షిణంగా 188కిమీ, డోన్ నుంచి ఉత్తరంవైపుగా 110 కిమీ దూరంలో ఉంది. ఇది ఆరేపల్లి స్టేషను, పూడూర్ రైల్వేస్టేషనుల మధ్య ఉంది. గద్వాల నుంచి రాయచూరు వరకు నూతన రైలుమార్గం 2013, అక్టోబరు 12నాడు ప్రారంభమైంది.[1] ఈ రైల్వేస్టేషను జిల్లాలోనే తొలి రైల్వేజంక్షన్ గా మారింది. మహబూబ్ నగర్, కర్నూలు మధ్యలో ఇది పెద్ద స్టేషను కావడంతో దాదాపు అన్ని రైళ్ళు ఇక్కడ ఆగుతాయి. ఇక్కడ రెండు ప్లాట్ ఫాంలు, 3 లైన్లు ఉన్నాయి. స్టేషను నిర్మాణం పట్టణానికి 2 కిమీ దూరంలో సంస్థానాధీశులు ఇచ్చిన స్థలంలో నిర్మించబడింది. ప్రారంభంలో ఇది మీటరుగేజీగా ఉన్ననూ 1997లో గేజిమార్పుతో బ్రాడ్‌గేజీగా మార్చబడింది.

రైల్వేజంక్షన్

[మార్చు]

2013, అక్టోబరు 12 నాడు గద్వాల నుంచి కర్ణాటకలోని రాయచూరు వరకు నూతనంగా నిర్మించిన 59 కిలోమీటర్ల రైలుమార్గం ప్రారంభం కావడంతో గద్వాల రైల్వేస్టేషను పాలమూరు జిల్లాలోనే తొలి రైల్వేజంక్షన్‌గా మారింది. ఈ జంక్షన్ వల్ల హైదరాబాదు నుంచి రాయచూరు వెళ్ళడానికి కాలయాపన తగ్గింది. ఇదివరకు రాయచూరు వెళ్ళే రైలుబండ్ళు వాడి నుంచి చుట్టూ తిరిగివెళ్ళేవి. 1999లో కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి బండారు దత్తాత్రేయ చేతులమీదుగా శంకుస్థాపన చేసుకున్న జంక్షన్ పనులు 2013లో కేంద్ర రైల్వేశాఖ మంత్రి మల్లికార్జున్ చేతులమీదుగా ప్రారంభం జరిగింది.

రైల్వే స్టేషను ఆధునికీకరణ

[మార్చు]

రైల్వేజంక్షన్ పనులు జరుగుతున్న కాలంలోనే రైల్వేస్టేషను ఆధునికీకరణ పనులు చేపట్టారు. పురాతన సంస్థానానికి ప్రతీకగా రైల్వేస్టేషను భవన నిర్మాణం కూడా కోట ఆకారంలోనే, పర్యాటకలను ఆకట్టుకొనేవిధంగా నిర్మించారు. కోటబురుజులు ఆకారం, గోడలపైన కోటనమూనా స్పష్టంగా కనిపించేటట్లు చేసి భవనం మొత్తాన్ని మట్టిరంగుతో తీర్చిదిద్దారు.

సౌకర్యాలు

[మార్చు]

గద్వాల రైల్వేస్టేషను‌లో కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ సౌకర్యం ఉంది. ప్రయాణీకులకోసం ఫుట్‌బ్రిడ్జి, మంచినీటిసౌకర్యం, కూర్చోడానికి బెంచీలు, అనౌన్స్‌మెంట్ సదుపాయం, స్టేషను బయట విశాలమైన పార్కింగ్ తదితరాలు ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 13-10-2013